Posts: 2,517
Threads: 150
Likes Received: 8,212 in 1,688 posts
Likes Given: 4,782
Joined: Nov 2018
Reputation:
593
బర్రున ఆటో ఆ యింటి ముందు ఆగింది. ఆటో దిగి డబ్బులు చెల్లించి సామాన్ల సంచులు బరువుగా, అలసటగా మోసుకుంటూ మెట్లెక్కి యింట్లోకి తీసుకువచ్చాడు రామపాదం.
"యిదిగో చూసుకో నువ్వు రాసిచ్చిన లిస్టులో ఉన్న సామానులన్నీ తీసుకొ... కాదు కాదు మోసుకొచ్చాను" ఆయాస పడుతూ చెప్పేడు రామపాదం సామాన్ల సంచులు జాగ్రత్తగా నేల మీద పెడుతూ. పగిలిపోయే గాజు సామాన్లు కూడా ఉన్నాయి వాటిలో మరి.
కాసేపు తరువాత -
"నేను రాసిందేమిటి - మీరు చేసుకొచ్చిందేమిటీ" వస్తువులు ఒక్కొక్కటీ చెక్ చేసుకుంటూ ఒంటి కాలి మీద లేచింది రామపాదం భార్య సుమతి. అంటే అవిడకో కాలు లేదని కాదు. కోపం వచ్చినప్పుడు అలా ఒంటి కాలు మీద లేవాలని ఆవిడ ఎక్కడో ఏదో పుస్తకంలో చదివిందట.
పండక్కి అమ్మ గారి ఊరికి వెళుతూ అక్కడి వారికి తీసుకు వెళ్లాల్సిన వస్తువులూ, బహుమతులూ అంటూ ఓ పొడుగాటి లిస్ట్ రాసిచ్చింది భర్త అనే ఆ మహానుభావుడికి సుమతి.
"నువ్వు చెప్పినట్టే నువ్వు రాసిన వస్తువులన్నీ తీసుకు వచ్చానుగా? ఇంకా ఏమిటిట లోటు? అసలు చెరువులో చేపల కోసం ఎదురుచూసే దొంగ కొంగలా ఆ కాలెత్తడమేమిటీ? దింపు. పడిపోగలవు" గాబరా నటించాడు రామపాదం ఆమె పడిపోకుండా పట్టుకుంటూ.
ముక్కుకి చేపను చిక్కించుకున్న కొంగలా చటుక్కున కాలు దించిన సుమతి "చూడండి! నేను రాసిచ్చిన లిస్ట్ లో సగం వస్తువులే తీసుకొచ్చారు తమరు. ఎందుకని?" అంటూ ఎగిరి ఈ సారి కయ్యానికి కాలు దువ్వింది.
రామపాదం జేబులోంచి సుమతి రాసిచ్చిన లిస్ట్ బయటికి లాగేడు. "చూసుకో నువ్వు నీ స్వహస్తాలతో రాసిచ్చిన లిస్ట్. ఇందులో ఉన్నవన్నీ తెచ్చాను కదా" లిస్ట్ ఆమె మీదికి విసురుతూ అన్నాడు.
కిటికీ లోంచి బయటికి పారి పోవడానికి ప్రయత్నించిన ఆ లిస్ట్ ని ఒడుపుగా ఒడిసి పట్టుకుని చెక్ చేసింది సుమతి. లిస్టు ముందు వైపు రాసి ఉన్న వస్తువులన్నీ వచ్చాయి గానీ వెనుక పక్క రాసిన వస్తువుల్లో ఒక్కటి కూడా లేదు ఆ సంచుల్లో ఎంత గాలించినా.
"చూడండి! ఈ వెనుక పక్కన రాసిన వస్తువుల్లో ఒక్కటంటే ఒక్కటి పట్టుకొచ్చారా తమరు?" అంటూ ఈ సారి అప్పడంలా విరుచుకు పడింది సుమతి.
"ఏదీ చూడనీ" అంటూ లిస్ట్ అందుకుని పరిశీలనగా చూసి "ఓహో వెనక పక్కన రాశావా!" అన్నాడు రామపాదం తేలిగ్గా.
"మీకింత మతిమరుపేమిటండీ బాబూ? ఖర్మ ఖర్మ" నెత్తీ నోరూ బాదుకుంది సుమతి సుతారంగా.
'నాకు మతిమరుపా' మనసులో స్వగతంలా అనుకున్నాడే తప్ప నోరెత్త లేదు రామపాదం. అందుకే మళ్లీ సుమతే నోరు చేసుకుంది -
"ఇలాగే మొన్నటికి మొన్న..." అంటూ ఉపోద్ఘతించింది.
"మొన్న...? మొన్న ఏం చేశానూ నేనూ?" అమాయకమైన ముఖంతో అడిగేడు రామపాదం.
"అప్పుడే మర్చి పోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా?" తీక్షణంగా అడిగింది.
"గుర్తు చేస్తే నీ సొమ్మేం పోదుగా" ఈ సారి రామపాదం ముఖం బేలగా మారిపోయింది.
"అదే ... మొన్న గురువారం ఆ రాధిక మనింటికి వచ్చినప్పుడు....." యింకా ఏదో చెప్పబోతుండగా ఆవిణ్ణి మధ్యలోనే ఆపేసి -
"ఎవరూ? మన ఎదురింటి డాబా యింట్లో ఉండే ఆ తెల్లగా పొడుగ్గా బూరె బుగ్గలతో కోటేరేసిన ముక్కుతో అందంగా మెరిసిపోతూ..." పరవశంగా చెప్పుకుపోతున్న మొగుణ్ణి ఒక్క గసురుతో బ్రేక్ వేసి ఆపింది సుమతి.
"ఆపండి మీ పొగడ్తలు. నేను చెప్పేది ఆ రాధిక గురించి కాదు. మన వెనుక వీధిలో ఉండే తెలుగు టీచర్ రాధిక మేడమ్ గురించి..." విశదీకరించి, విడమరిచి, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పింది సుమతి.
అప్పటికే గాలి తీసిన బెలూన్లా ముడుచుకుపోయిన రామపాదం "ఆ అమ్మాయా?" అన్నాడు నీరసంగా.
"అవును ఆ అమ్మాయే! ఇంకా చెప్పాలంటే చింపిరి జుట్టుతో, చికిలి కళ్ళతో, కాటుక రంగులో..." కొనసాగించింది సుమతి.
"ఇంక చాల్లే అపు నీ వర్ణన - గుర్తొచ్చింది గానీ! ఇంతకీ ఆ వెనక వీధి రాధిక వచ్చినప్పుడు నేనేం వెలగబెట్టేనో అది చెప్పు ముందు" అన్నాడు చిరాగ్గా.
"ఏమిటా? ఆ అమ్మాయి వచ్చి - 'సార్ మీరు కథలు రాస్తారు కదా. నేనూ ఓ చిన్న కథ రాశాను. చదివి ఎలా ఉందో చెప్పండి' అని అడిగితే - పూర్తిగా చదవకుండానే కథ అసంపూర్తిగా ఉందని తేల్చి చెప్ప లేదా తమరు?" నిలదీసింది సుమతి.
"మరి? కథ పూర్తి కాకుండా సగంలో అపేసినట్టుగా ఉంటే ఆ విషయం తెలియ చెప్పకపోతే ఎలా? యిలాంటి లోపాలు తెలియపరచకపోతే ఆ అమ్మాయి రచయిత్రిగా ఎలా రాణిస్తుందనుకున్నావు?" అన్నాడు రామపాదం.
"అదే విషయం నేనా పిల్లని అడిగితే 'మిగతా సగం కథ ఆ పేజీ వెనుక పక్క రాశాను కదా వదినా' అని నా దగ్గర ఎంతలా వాపోయిందో తెలుసా?" జాలితో కూడిన ఆ రాధిక ముఖం కళ్ళ ముందు మెదలగా మెల్లగా చెప్పింది సుమతి.
"ఏమిటీ? పేజీకి రెండో వైపున రాసిందా? అదీ సంగతి!" అన్నాడు రామపాదం విషయం అర్థమై.
"ఆ సంగతలా ఉంచండి. మొన్నటికి మొన్న హాఫ్ యియర్లీ పరీక్షల్లో లెక్కల్లో వందకి వంద మార్కులు తెచ్చుకున్న మన పండుగాడి ఆన్సర్ పేపర్ పూర్తిగా చూడకుండానే నలభై అయిదు మార్కులేనా వెధవా అని వాణ్ణి నానా తిట్లూ తిట్టేరు గుర్తు లేదా తమరికి?" కొశ్నించింది సుమతి.
"అవును! వాడి ఆన్సర్ పేపర్ కౌంట్ చేస్తే నలభై అయిదు మార్కులే కదా వచ్చింది టోటల్?" అయోమయంగా అడిగేడు రామపాదం.
"చాల్లెండి. వాడి పేపర్ వెనుక పేజీలో మిగతా యాభై అయిదు మార్కులు ఉన్నాయన్న విషయం తమరసలు పరిశీలనగా చూసి ఏడిస్తే కదా?" అంటూ ఈసడించింది సుమతి.
"పేపర్ వెనుక వైపు రాశాడా?" ఆశ్చర్య పోయాడు
రామపాదం.
"రాయడా మరి ముందు పేజీలో చోటు సరిపోకపోతే?" నాలుగు పెద్ద సూట్ కేసులూ, రెండు బిగ్ షాపర్ సంచీలూ సర్దడం పూర్తి చేస్తూ అంది సుమతి.
సుమతి గుర్తు చెయ్యక పోయినా - మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలూ, రామపాదం మనసులో కదలాడుతున్న సంగతులూ మరి కొన్ని యిక్కడ ప్రస్తావించుకోక తప్పదు మనకు.
ఓ సారి యిలాగే -
ఓ రచయితల సాహితీ సమావేశం ప్లస్ బహుమతుల ప్రదానోత్సవానికి అతిథిగా పిలిచారు రామపాదాన్ని. ఆ నాటి కార్యక్రమంలో ముందుగా సమోసా, తేనీటి సేవల అనంతరం స్టేజ్ మీద ముఖ్య అతిథి ప్రసంగం, ఆ తరువాత మరి కొందరు మైకాసురుల అధిక ప్రసంగాల అనంతరం -
రామపాదం చేతికి ఆ నాటి కార్యక్రమంలో బహుమతులు స్వీకరించవలసిన - అంతగా పేరు ప్రఖ్యాతలు లేని ప్రముఖ రచయితల పేర్లతో నిండి ఉన్న పెద్ద జాబితా అందించ బడింది నిర్వాహకుల నుండి.
లిస్టును పై నుంచి కిందికి ఓ సారి పరిశీలించి చూశాడు రామపాదం. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు అందరూ ఆ రోజు ఆ సభలో అవార్డులూ, సన్మానాలు, ప్రశంసా పత్రాలు అందుకోవలసి ఉంది.
ఆ శుభ సమయం కోసం వాళ్ళు అందరూ స్టేజి దిగువన పిల్లా పీచూ, బంధుమిత్ర సపరివార సమేతంగా ఆత్రంగా వేచి చూస్తున్నారు. సభ నిండుగా కనిపించడం కోసం రచనలు పంపిన వారందరికీ ఆహ్వానాలు పంపబడ్డాయి. వారిలో ఎవరికి బహుమతి లేదా అవార్డు వచ్చిందో నిర్వాహకులకు తప్ప వేరే వారెవరికీ తెలియదన్న మాట.
అందుకే ఎవరికి వారు తమకు మాత్రం అవార్డు, సన్మానం తప్పదనే ధీమాలో ఉండి తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ పేరు మైకులో వినబడగానే స్టేజి మీదకు పరుగు పెట్టడానికి రన్నింగ్ రేసుకు సిద్ధపడ్డ అభ్యర్థుల్లా ఎదురు చూపులు చూస్తూ కళ్ళకు కాయలు, చెవులకు పళ్ళు కాయించుకుంటున్నారు.
లిస్టు చూసి రామపాదం పేర్లు పిలిచిన కవులూ, రచయితలూ ఒక్కొక్కరుగా ఆనందంగా స్టేజి మీదకు వచ్చి సన్మానం, అవార్డు అందుకుని ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేసి శాలువాలు, చెక్క ముక్క
జ్ఞాపిక, పూలదండల బరువుతో స్టేజి దిగుతున్నారు.
ఆ లిస్ట్ లో ఉన్న వారందరి పేర్లూ పిలిచిన తరువాత రామపాదం తన ప్రసంగ పాఠం ఉన్న కాగితాల బొత్తి లాల్చీ జేబులోంచి బయటికి లాగి తన ప్రసంగం మొదలు పెట్టేశాడు.
"వేదిక మీద ఉన్న పెద్దలకూ, వేదిక ముందున్న పెద్దలూ, కవులూ, రచయితలూ, ఫోటోల వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ నాటి సభలో బహుమతులూ, అవార్డులూ, సన్మానాలు అందుకున్న...." అంటూ మొదలు పెట్టబోతుండగా స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులు మరియూ స్టేజి దిగువన ఉన్న సభాసదుల్లో కలకలం, కలవరం బయలు దేరింది. తమ పేరు బహుమతి గ్రహీతల జాబితాలో ఉందని ముందుగానే పేపర్ లీక్ అయి తెలిసిపోయిన వాళ్ళు పెట్టిన హాహాకారాలు హాలు స్లాబు ముట్టేయి.
తన ప్రసంగానికి అడ్డు తగులుతున్న వారిని చూసి రామపాదం చిరాకు ప్రదర్శించి ప్రసంగం కొనసాగించబోతుండగా - లాల్చీకి పిన్నీసుతో బాడ్జ్ గుచ్చుకున్న సభ నిర్వాహకుల్లో ఒకాయన వడివడిగా, హడావిడిగా స్టేజి మీదకు దూసుకు వచ్చాడు. రామపాదం చెవిలో నోరు పెట్టేసి గుసగుసగా 'అయ్యా లిస్టు యింకా పూర్తి కాలేదు. బహుమతులు అందుకోవలసిన వారి జాబితా యింకా పూర్తి కాలేదు. ఇంకా సన్మానం అందుకోవలసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పి టి వో అనగా పేజీ త్రిప్పి చూడుడు' అని చెప్పిన మాటలు రామపాదం చేతిలో ఆన్ లో ఉన్న మైకులోకి జొరబడిపోయి హాలు హాలంతా ప్రతిధ్వనించాయి.
'పేజీ వెనుక రాశారా' అంటూ పేజీ తిప్పి చూసి - తతిమా వాళ్ల పేర్లు చదువుతూ మిగతా కార్యక్రమం కొనసాగించి పూర్తి చేశాడు. తరువాత తన ప్రసంగ పాఠం ఉన్న కాగితాల బొత్తి మరో సారి జేబులోంచి పైకి లాగి -
"వేదిక మీద ఉన్న పెద్దలకూ, వేదిక ముందున్న పెద్దలూ, కవులూ, రచయితలూ, ఫోటోల వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ నాటి సభలో బహుమతులూ, అవార్డులూ, సన్మానాలు అందుకున్న...." అంటూ పునరుద్ఘాటించాడు ఆ నాడు.
"ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా చూస్తూ ఊరుకున్నారు? యేమిటాలోచిస్తున్నారు?" అన్న భార్య కేకతో ఉలిక్కి పడి గత లోకం లోంచి ఇహ లోకంలోకి తిరిగి వచ్చాడు రామపాదం.
"సరే సరే యింక మాటలెందుకు గానీ ట్రైన్ కి టైం అవుతోంది. బయలుదేరింక" మాట మార్చేశాడు రామపాదం.
రామపాదం ఓ మోస్తరు రచయితే కాక ఓ చిన్న మాస పత్రికకు సంపాదన లేని సంపాదకుడు కూడా. అతని భార్య సుమతి గడుసుదే కానీ వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి పాత కాలం మనిషి. ఈ కాలానికి సంబంధించిన సెల్ ఫోన్లు, వాట్సాపులు అవీ ఉపయోగించడం ఆమెకు యిష్టం లేదనే కంటే తెలియదు అనే చెప్పాలి.
పండక్కి ఒంటరిగా రైలెక్కింది సుమతి - రామపాదం తీసుకు వచ్చిన అరకొర సరుకులతోటే సణుక్కుంటూ. 'పత్రిక ఈ వారంలో విడుదల చెయ్యాలి. నేన్రాను నువ్వెళ్ళి వచ్చేయ్' అని రామపాదం ముందే టలాయించడంతో ఒక్కతే బయలుదేరి వెళ్ళింది అమ్మ గారింటికి సుమతి.
సుమతి పుట్టింటికి వెళ్లిన సమయంలో కట్టలు కట్టలుగా పోస్ట్ లో వచ్చిన కథలు చదివి - ప్రచురణకు సెలెక్ట్ అయిన కథలు ఫోల్డర్లలో జాగ్రత్త చేయడంలోనూ, ఎన్నిక కాని కథలను తిరుగు టపా కవర్లలో ఉంచి వెనక్కి తిప్పి పంపే పనిలోనూ బిజీ బిజీ అయి పోయాడు ఎడిటర్ రామపాదం.
ఎన్నిక కాక తిరుగుటపా కవర్లు లేని హాస్య కథలతో నాలుగు పొడి చెత్త డబ్బాలూ, పనికిరాని ఏడుపు గొట్టు కథలతో నాలుగు తడి చెత్త డబ్బాలు నిండిపోయాయి.
పది రోజుల తరువాత పోస్టులో వచ్చిన కథల కవర్లతో కలిసిపోయి వచ్చిన భార్య రాసిన కవరు గమనించి తెరిచి ఆమె రాసిన ఉత్తరం బయటికి లాగి చదవసాగేడు రామపాదం.
ఆ పేజీ నిండా వాళ్ళ పుట్టింట్లో పండగ ఎంత వైభవంగా జరుపుకున్నారో, వాళ్ల అన్నయ్యలు వదినలు, వాళ్ల పిల్లలతో తను ఎంత సరదాగా ఎంజాయ్ చేసిందో, వాళ్ళ అమ్మ ఏమేమి పిండివంటలు వండిందో నోరూరించేలా రాసి నింపేసింది శ్రీమతి. ఉత్తరం మడిచి కవర్లో పెట్టేసి తిరిగి రచనల కవర్లు తెరిచి కథలు సెలెక్ట్ చేసే పనిలో నిండా మునిగి పోయాడు రామపాదం.
ఆ రోజు తెల్లవారు జామునే కాలింగ్ బెల్ మోగడంతో లేచి తలుపు తెరిచాడు రామపాదం నిద్ర కళ్ళతో.
ఎదురుగా ఉగ్రరూపంలో సుమతి!
"స్టేషన్ కి రమ్మని ఉత్తరం రాస్తే ఎందుకు రాలేద"ని అరిచింది ఆవేశంగా - రెండు చేతుల నిండుగా ఉన్న నాలుగు చేతులకు సరిపడా సామాన్ల సంచులు కింద పెట్టి కందిపోయిన అరచేతులూ, వేళ్ళూ ఊదుకుంటూ.
'నువ్వు అరిస్తే ఎంత ముద్దుగా ఉంటావో తెల్సా' అని ఎప్పటిలా ఆవిణ్ణి ఉబ్బేద్దామనుకున్నాడు గానీ దానికిది సమయం కాదని తనకు తానే సర్దిచెప్పుకొని -
"పండగ ఎంత వైభవంగా జరిగిందో రాశావు గానీ ఏ రోజు ఏ బండికి వస్తున్నదీ రాయక పోతే స్టేషన్ కి ఎలా రాగలను?" తనూ అంతే అవేశంగా అరిచేడు రామపాదం 'తగ్గేదేలే' అన్నట్టుగా.
"ఆ ఉత్తరంలో రాశానుగా? ఏదీ నా ఉత్తరం?" అంటూ రామపాదం టేబుల్ డ్రాయర్ లోంచి ఉత్తరం వెతికి తీసి - "ఇదిగో ఈ రైలుకి వస్తున్నాను. స్టేషన్ కి రావలెను - యిట్లు మీ పాదదాసి అని స్పష్టంగా రాశానుగా" అంటూ పొందికైన అక్షరాల్లో రాసిన వైనం చూపించింది సుమతి.
ఆ ఉత్తరం అందుకుని పరిశీలిస్తే ఉత్తరం వెనుక వైపు స్పష్టంగా ఎప్పుడు, ఏ రైలుకి వచ్చేదీ సుమతి స్వహస్తాలతో రాసిన వివరం ఉంది.
"అదీ సంగతి. ఓ పత్రికా సంపాదకుడి భార్యవై ఉండి నువ్వు కూడా యిలా పేజీకి వెనుక వైపు రాస్తే ఎలా బంగారూ? పేజీకి ఒకవైపే కదా రాయాల్సింది. అది కథైనా, ఉత్తరమైనా, మరేదైనా పేజీకి రెండో వైపున రాసింది ఏదీ నేను చూడనని ఇన్నేళ్ళ నా సాహచర్యంలో నీకు తెలిసిన విషయమేగా?" తన తప్పేం లేక పోవడంతో బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు ఎడిటర్ రామపాదం.
చేసేది లేక గతంలో జరిగిన అనుభవాల్ని గుర్తు తెచ్చుకుని ఓ దీర్ఘమైన నిట్టూర్పు, ఓ పత్రికా సంపాదకుడి భార్యగా మెట్టినందుకు మరో గాఢమైన నిట్టూర్పు విడిచి వంట గదిలోకి వెళ్ళి గిన్నెల మీద తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది సంపాదన లేని సంపాదకుడు రామపాదం అర్ధాంగి శ్రీమతి సుమతి.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,859
Threads: 4
Likes Received: 2,926 in 1,325 posts
Likes Given: 3,770
Joined: Nov 2018
Reputation:
59
పత్రికా సంపాదకుడా, పేజీకి ఒక పక్క అంటే అర్థమిదా  ...బావుంది k3vv3 గారు
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 2,517
Threads: 150
Likes Received: 8,212 in 1,688 posts
Likes Given: 4,782
Joined: Nov 2018
Reputation:
593
రామారావు మనసంతా అల్లకల్లోలంగా ఉంది.
"వెధవ క్యాంపు. బాస్ కు ఎందుకు పడుతుందో, ఏమోకానీ మా ప్రాణాలు తోడేస్తున్నాడు" — క్యాంపు కెళుతున్న మేనేజరును శాపనార్ధాలు పెట్టుకుంటూ మోటార్ బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. ఎంత చేసి నా ఓగదెగని వర్క్ వలన ఈ వారం రో జల నుంచి ఇంటికెళ్ళేటప్పటికి రాత్రి ఎనిమిది అపుతోంది రామారావుకు
ఇంట్లో అడుగుపెట్టిన రామారావు కోపం ఒక్కసారిగా తారా స్తాయి కు వెళ్ళింది. . పిల్లల ఆట బొమ్మలు, వంటసామాను, బట్టలు ఇల్లంతా చల్లినట్లు పడిఉన్నాయి. ఆఫీసులోని విసుగు, ఆవేశం దశలు మారి కోపంలా మారింది రామారావులో.
"ఛీ ఛీ. ముదనష్టపు ఇల్లు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదుకదా, ఏన్ని సార్లు చెప్పినా అంతే, ఇల్లు సర్డుదామని లేదు. చీ. సంసారంకూడా ఒక నరకమనిపిస్తుంది. ఏ సుఖమూ లేదు. పాడూలేదు ఉండదుగదా. ఎన్ని సార్లు చెప్పి నా జ్ఞానం లేదు " విసుగు కోపం తో చైర్లో కూర్చున్నాడు.
"వచ్చి అర్ధగంట అయింది, ఎక్కడకు వెళ్ళిందో ఏమో. కట్టుకొన్న వాడోకడు వస్తాడని, వాడి ముఖాస అన్ని కాఫీ నీళ్ళు కొట్టాలని ఇంగిత జ్ఞానమైనా ఉంటేగదా" అసహనంగా లేచి షర్ట్ విప్పి హాంగరుకు తగిలించను వెళ్లాడు. "తెచ్చేవరకు హేంగరు లేధని ఒకటే గోల. తెచ్చి పది రోజులు అయినా ఇంతవరకు గోడకు కొట్టి ఏడ్చిందిలేదు. ఇంతకీ ఏ యింట్లో చచ్చిందో సినిమా కబుర్లు, బెండకాయ పీచులని. ఇంతవరకు తగలడిందిలేదు. ఇంత పొద్దుపోయినా పిల్లలు వచ్చింది లేదు. వీళ్ళు ఏ ఊరిమీద షికారు కొడుతున్నారో ఛీ ఛీ... ఏం ఇల్లో ఏం సంసార మో" షర్టును తను మామూలుగా తగిలించే కిటికీ రెక్కికు తగిలించను వెళ్లాడు .
ఇంతలోనే వెనుకనుంచి రాధ…
"ఏమండీ రామారావుగారూ....” "నోర్ముయ్ తిరిగి పేరు పెట్టి పిలుస్తున్నావు "
"ఏమండో య్ రామారావుగారూ. ఒక్కసారి ఇటు తిరిగి చూడండి.
"నేను ఎక్కడికి వెళ్ల లేదు. స్నానం చేసి ఇప్పుడే వస్తున్నాను. పిల్ల లు కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని, మీ కేకల్ని విని భయపడి వంటింట్లో దాక్కొని ఉన్నారు. అన్నట్టు - మీరు ఈ ఇల్లు కాళీ చేసి వెనుక వీధిలో చేరి మూడు రో జులయింది. ఏదొ వ్యాపకంలో, అలవాటులో ఇక్కడికి వచ్చి చూసుకోకుండ ఎగురుతున్నారు.
షర్టు తగిలించిన రా మా రా పు కరంటు షాక్ కొట్టినట్టు వెనుకకు తిరిగి చూసాడు.
"తన భార్యకాదు. తన పిల్లలూ కాదు.”
కళ్ళు ఒక్క సారిగా బైర్లు కమ్మికట్టు అయ్యాయి రామారావుకు. అడు గులు వడివడిగా బ య ట కు నడిచాయి.
"ఏమండోయ్ బనియన్ తో నే వెళుతున్నారే. ఆ కిటికీకి తగిలించిన షర్ట్ మీదే "
షర్ట్ వేసుకొని తల చేతుల్లో కప్పుకొని ఎలా ఇంటిలో పడ్డాడో ఇ ప్ప టి కీ రామారావు అర్ధం కాలేదు .
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,517
Threads: 150
Likes Received: 8,212 in 1,688 posts
Likes Given: 4,782
Joined: Nov 2018
Reputation:
593
"ఏమండీ, దీపావళి పండగ దెగ్గర పడుతోంది", అంది శకుంతల.
"అవును, నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు మరి", అన్నడు భర్త నరసింహం, వెటకారంగా.వారిది ఎంత అన్యోన్య దాంపత్యమో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వెటకారం ఆయన ఇంటి పేరు. నిజమే అనుకున్నారా? కాదు అది శకుంతల ఆయనతో అనే అతి పెద్ద పరుషమైన మాట,అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఆమె ఎంత సౌమ్యమో. ఇంటి పేరు అవధానం లెండి. నరసింహానికి పేరుకు తగ్గ కోపం, కోపానికి మించిన భక్తి, దాని కి మించిన క్రమశిక్షణ, మంచి బ్యాంకు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ ,నలుగురు పిల్లలను పెంచి ప్రయోజకులని చేసారు దంపతులు.
ఇవన్నీ చేసాక ,బీపీ -షుగర్ లాంటివి కదా రావాలి? అవి రేలేదు కానీ “చాదస్తం బాగా పెరిగిందండి” అంటుంది ఆవిడ.
"పండగ దగ్గర పడుతోంది, తెలుసు! ఈసారి విజయని, గోపాల్ నీ, పిల్లల తో పాటు రమ్మని వాట్సప్ లో పెడితే, అల్లుడు గారు మనల్నే అక్కడకి రమ్మంటూ ఒకే పట్టు పట్టాడు. పండక్కి పిల్లలు రావటం కాదా నే ఆనవాయితీ? మన ఇంటా- వంట ఉందా ఆ ఆచారం? కాస్త ఆలోచించి అడగాలి గా?" అసహనం తో
అన్నడు నరసింహం,
" అయ్యో రామా! ఏమబ్బా మీ చాదస్తం? పిల్లలు వాళ్ళ కొత్త ఇల్లు మనకు చూపించాలని ముచ్చట పడుతున్నారు. ఇంతకన్నా మంచి సంప్రదాయం ఏముంటుంది?" అంది శకుంతల.
"ఓ! మీరు ముందే మాట్లాడు కున్నారు అన్నమాట. అందుకే నే నిన్ను కలువశ్రీ అనేది" వ్యంగంగా అన్నాడు నరసింహం.
అన్ని విషయాలూ పిల్లలకు కల్వం లో పోసి నూరే లాగ , నూరి పోస్తుందనే బ్రహ్మ తో, శకుంతలకు ఆయన ఇచ్చిన కితాబు “కల్వశ్రీ “.
"సరే, కానీయండీ, అన్నీ ప్లాన్ చేసుకున్నాక నేను ఎందుకు మాట్లాడడం? అయినా ఎవరన్నా ఇంటికి వెళ్ళడం అంటే క్యూలో ముందు నువ్వే ఉంటావ్ గా , బట్టలు సర్దు మరి", అన్నాడు చిరు నవ్వు తో నరసింహం.
"ముందు మీరు స్వగృహా కి వెళ్లి , నే చెప్పాను అని చెప్పి అరిసెలు, లడ్డూ, బూందీ , అలాగే జోషి దెగ్గరికి వెళ్లి గోంగూరా…." ఇంకా శకుంతల పూర్తి కూడా చేయలేదు తన మాట
"నీ పేరు చెప్పి తేవాలా? ఏ, మా మామా గారి షాపా అది? మాకు తెలుసు ఎలా బేరం ఆడాలో " అంటూ తన ఈవెనింగ్ వాక్ కి వెళ్లి పోయాడు నరసింహం.
తెల్లవారు జామున బీబీసీ వార్తలు రేడియో లో వినడం, పాలు, కాఫీ వ్యవహారం, ఓ గంట అనుష్టానం, నలభై సంవత్సరాలు పై చిలుకుగా రాస్తున్న డైరీ రాయటం, బాగా చదవడం, ఈవినింగు వాక్ వెళ్ళటం, దారి మధ్య వచ్చిన ఆంజనేయ స్వామి గుడి , శివాలయం ముందర చెప్పులు విప్పటం, బయట నుండే నమస్కారం , నల్ల కుంట మార్కెట్ వైపు ప్రయాణం, ఇదీ నరసింహం దినచర్య .
కానీ ఈ రోజు మాత్రం, పోయిన సంవత్సర దీపావళి విశేషాలు తన బుర్రలో తిరుగు తున్నాయి. మొహం పై చిరునవ్వు, మనవడు అనురాగ్ మనుమరాలు నీహారికల అల్లరి, అన్నిటికీ మించి క్రాకర్స్ అంటే బయపడే అనురాగ్. ఎందుకో అంత భయం? అందరు పిల్లలు ఒకే రకం కాదు కదా” లాంటి ఆలోచనలతో జోషి పికెల్స్ చేరుకున్నాడు నరసింహం.
దంపతులు తమ కూతురు,అల్లుడి ఇంటికి చేరారు. సరదా పలకరింపులు , పిల్లల ముచ్చట్లు, అనురాగ్ తను నేర్చుకున్న శ్లోకాలు వినిపించటం, రైమ్స్ చెప్పటం, అలా సాగిపోయింది ఆ సాయంకాలం .
"మరి లక్ష్మీ పూజకి కి సామాగ్రి? క్రాకర్స్? గోపాల్ , సాయంత్రం వెళదామా?" అడిగాడు నరసింహం.
" లక్ష్మీ పూజా? అమ్మ పేరు విజయలక్ష్మి గా , మరి అమ్మకు పూజా?" ఆడిగాడు అనురాగ్ అర్థం కాక.
“ఈ పూజ లక్ష్మి దేవికి అనురాగ్! అయినా ఇంటి ఆడపడుచు ఎవరైనా లక్షీదేవి సమానులే" అంది శకుంతల, అనురాగ్ తల నిమురుతు.
ఒకరకమైన వ్యంగ్య ముఖ కవలళిక పెట్టరు , మామా అల్లుడు.
క్రాకర్స్ అన గానే ,అనురాగ్ కళ్లలో ఆందోళన మొదలైంది.
మరు దినం వాళ్ళు పూజకు సిద్ధమవుతుండగా, అనురాగ్ కాస్త కంగారుగా చూస్తూ గదిలోకి ప్రవేశించాడు.అమ్మమ్మ చీరను లాగుతూ " అమ్మమ్మా, నేను రేపు క్రాకర్స్ పేల్చాలా?"
మెల్లిగా నవ్వింది శకుంతల. "డోంట్ వర్రీ, డియర్, తాతయ్యా నీ పక్కనే ఉంటారు".
కానీ అనురాగ్ అంతటి తో ఆగలేదు ,"అయితే... పెద్ద శబ్దాలు... నాకు భయం అమ్మమ్మ!"
" ఏంటి? నా మనవడు క్రాకర్స్‌కి భయపడుతున్నాడా? మా కాలం లో మేము, ఇలా చేతుల్లో పట్టుకొని పేల్చే వాళ్లం , ఈ క్రాకెర్స్" అన్నాడు నరసింహం.
పక్కనే నిల్చున్న గోపాల్ పరిస్థితిని గమనించి, "పెద్ద శబ్దాలకు కొంచెం అనురాగ్ సెన్సిటివ్ , మామగారు. ఇది కొంతమంది పిల్లలకు సాధారణం కదా" అన్నాడు.
"సాధారణమా? అనురాగ్, మై బాయ్, మీరు మీ భయాలను జయించాలి. క్రాకర్స్ శబ్దం లేని దీపావళి అంటే అది స్వీట్ గా లేని చాక్లెట్ లాంటిది!
మనం కలిసి క్రాకర్స్ కలుద్దాం, సరదాగా!”
ఈ సంభాషణ అనురాగ్‌కి అంత అర్ధం కాలేదు, కానీ, తాతను నిరాశపరచకూడదని తల ఊపాడు.
నరసింహం కు ఈ దీపావళి పండగ చాల బిన్నంగా ఉంది. మాములుగా పండక్కు తన ఇంటికి పిల్లని పిలవడం ఆయన ఆచారం , కానీ తానే కూతురు ఇంటికి రావడం అంత నచ్చక పోయినా, ఇదోక థ్రిల్లింగ్ బ్రేక్ గా బావించాడు.
"బాబు భయం పోగొట్టుకోవాలి, బహుశా అందుకే మనం ఇక్కడ ఉన్నామేమో"
తనలో నే తను అనుకున్నాడు, నర్సింహం.
"మీరు బాబు తో కాస్త సమయం గడపండి, కౌన్సెలింగ్ లో మీరు అది-ఇది అని చెప్పుకుంటారుగా” , నవ్వుతో అంది శకుంతల.
అనురాగ్ కి భయం పోగొట్టే బాధ్యతగ తీసుకున్నాడు, నరసింహం తాతయ్య .
అనురాగ్, తన గదిలో కూర్చొని, తన బొమ్మలతో నిశ్శబ్దంగా ఆడుకుంటూ కనిపించాడు.
“మనం అలా వాక్ కు వెల్దామా? హాయిగా కబుర్లు చెప్పుకుంటూ?” పిలిచాడు నరసింహం ప్రేమగా
అనురాగ్, సిగ్గుతో నవ్వాడు, ఇద్దరు వాక్కు కు బయలుదేరారు.
"చెప్పు అనురాగ్, “నీకు క్రాకర్స్ అంటే ఎందుకు అంత భయం?"
“బాగా గట్టిగ చప్పుడు చేస్తాయ్ , తాత! పేలే దాకా, చూస్తూ ఉండాలి,ఇంకా అవి ఎప్పుడు పేలుతాయో తెలియదు , ఎలా పేలుతాయో తెలియదు, అవి సడన్ గా గట్టిగ శబ్దం చేస్తాయ్ తాత! అందుకే భయం!" అన్నాడు మెల్లగా ,ముద్దుగా.
"అయ్యో" అన్నాడు నరసింహం ఆలోచనగా నవ్వుతూ. "నీకు తెలుసా? భయం తరచుగా తెలియని విషయాల నుండి వస్తుంది. మనకు ఏదైనా అర్థం కానప్పుడు, అది భయంగా ఉన్నదానికంటే కూడా భయంకరంగా అనిపించవచ్చు, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను"
ఇద్దరూ ఒక బెంచీ మీద కూర్చున్నారు.
"మొదట ఆశ్చర్యం వల్ల భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ఏదైనా జరిగితే, పటాకులు పేలినట్లు, అది మనల్ని భయపెడుతింది . కానీ అది జరుగుతుందని మనకు ముందే తెలిస్తే, మనం తక్కువ గా భయ పడతాం, అందుకే మనం ఎప్పుడూ క్రాకెర్స్ వెలిగించే ముందు ఒక అడుగు వెనక్కి వేస్తాం, కాబట్టి సౌండు ని ఎప్పుడు ఎక్సపెక్ట్ చేయాలో మనకు తెలుస్తుంది."
అనురాగ్ కళ్ళు పెద్దవి చేసుకుని శ్రద్ధగా వింటున్నాడు.
"రెండవది, ఐడియా లేకపోవడం వల్ల, విషయాలు భయంగా అనిపించవచ్చు. కానీ క్రాకెర్స్ జస్ట్ కాగితంలో చుట్టబడిన కొంచెం కెమికల్ మాత్రమే. మనం జాగ్రత్తగా ఉంటే, అవి అస్సలు ప్రమాదకరం కాదు. ఇది ఒక మాయాజాలం లాంటిది. ఒకసారి ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే, అది అంత ఆహ్లాదంగా ఉంటుంది."
అనురాగ్ నెమ్మదిగా నవ్వాడు.
" మూడవది, కొన్నిసార్లు ఏదైనా ఇన్సిడెంట్ ట్రోమా తో ముడిపెట్టడం వల్ల భయం వస్తుంది. బహుశా నువ్వు ఎప్పుడో ఒకసారి పెద్ద శబ్దం విని ఏదో బాడ్ గా అనుకుంటుంటావు. కానీ , అన్ని పెద్ద శబ్దాలు ప్రమాదకరమైనవి కావు. సింహం గర్జించేది, ఉరుము చప్పుడు చేసేది గట్టి గానే, వాటి కమ్యూనికేషన్ అదే !”
సింహం గర్జించడం అనగానే అనురాగ్ నవ్వాడు. అనురాగ్ తన ఛాతీని ముందుకు పెట్టి " Yes! I am Lion " అన్నాడు.
"చివరిగా, భయం కొన్నిసార్ల మనం పెరిగే కొద్ది, అది తగ్గుతూ వస్తుంది, మనం భయపడిన చాలా విషయాలు ఫ్యూచర్ లో అంత భయం గా అనిపించవు. ఇది సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్లే - మొదట, పడిపోతారని భయపడతాం, కానీ ఒకటికి రెండు సార్లు పడుతూ, లేస్తూ ప్రాక్టీస్ చేస్తే , You will relaize that, it's just a balance. ”
" Thank You తాతయ్యాయి! I want to try that soon" అనురాగ్ నవ్వుతూ అన్నా డు .
“క్రాకర్స్ ఒక్కటే కాదు అనురాగ్, జీవితం లో ఏ విషయం అయిన ఇంతే. దీన్ని లైఫ్ లెసన్ గా ట్రీట్ చెయ్యాలి” అన్నా డు నరసింహం ఎమోషనల్ గా .
శకుంతల , ఇంటిల్లిపా దుల కు నునేతో తలంటి, అందరికి తిలకంబొట్టు పెట్టి , ఆమె తయారుచేసిన మైసూర్పాక్‌ను వారికి అందించింది. పండక్కి వారు కొన్నా కొత బట్టలూ అందరికి ఇచ్చారు దంపతులు.
చిన్నవారంతా పెద్ద వారికి నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు అందు కున్నారు.
మరుసటి రోజు సాయంత్రం, కుటుంబం అంతా క్రాకర్స్ పేల్చడానికి గుమిగూడగా, నరసింహం అనురాగ్ పక్కనే నిలబడి, చిన్న స్పార్క్లర్తో ప్రారంభించారు, అనురాగ్ వణుకుతున్న చేతులతో దానిని పట్టుకున్నాడు.
"ఫర్వాలేదు,నేను ఇక్కడే ఉన్నాను" మెల్లిగా అన్నాడు నరసింహం.
మెరుపులు మెరిసిపోతుంటే, అనురాగ్ సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. అతనికి ఇక భయం అనిపించలేదు. వారు ఒక భూ చక్రానికి, ఆపై పూల కుండకు వెళ్లారు. అలా ఒక్కో క్రాకర్‌తో అనురాగ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.
చివరగా, వారు పెద్ద బాంబు ని తీసుకున్నారు -అనురాగ్ ఎప్పుడూ భయపడే బిగ్గరగా సౌండు వచ్చె క్రాకర్ అది ! అయితే ఈసారి తాతయ్య భుజంపై చేయి వేసుకుని సిద్ధమయ్యాడు. వారు ఫ్యూజ్ వెలిగించి, ఇద్దరూ కలిసి వెనక్కి అడుగులు వేశారు.
”బ్యాంగ్!” గట్టిగా క్రాకర్ పేలింది, అనురాగ్ తడబడ్డాడు, కానీ అతను పరుగెత్తలేదు. పైగా , తాతను చూసి గర్వంగా నవ్వాడు.
"You did it అనురాగ్!" గట్టి గా అన్నాడు నరసింహం.
ఆ రెండు రోజులు నరసింహం , సంప్రదాయం గురించి దాని కానీ, దాని తాలూకా పట్టింపుల గురించి కానీ ఆలోచించలేదు. మనవడికి భయాన్ని పోగొట్టడం లో తన పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉన్నాడు. అందరు బోజనాలకి కూర్చున్నారు. సందడిగా నవ్వులు,మాటలతో గది నిండిపోయింది.
నరసింహం తనలోతాను అనుకుంటున్నాడు" కొన్నిసార్లు మార్పు అవసరం,అది కొత్త సవాళ్లను వాటితో పాటు కొత్త అనుభూతిని తెచ్చిపెడుతుంది ”.
తనదైన నవ్వు తో, శకుంతల వైపు చూశాడు కృతజ్ఞ తా భావంతో, ఆమె అదే నవ్వుతో అలాగే జవాబు ఇచ్చింది.
"వచ్చే సంవత్సరం, మనం మళ్ళీ దీపావళికి కలుద్దాం” అనుకున్నాడు మనసులో.
"సాంప్రదాయాలు మారొచ్చు కానీ, ప్రే మా ను రాగాలు మారకూడదు"
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,517
Threads: 150
Likes Received: 8,212 in 1,688 posts
Likes Given: 4,782
Joined: Nov 2018
Reputation:
593
దీపావళి పండక్కి అల్లుడికి రావడం కుదరదుట. మనల్నే వాళ్ళింటికి రమ్మని ఫోన్ చేశాడు అని చెప్పాడు భార్యతో కృష్ణమూర్తి.
అదేంటి! కొత్తల్లుడు కదా, పండక్కి తను అత్తారింటికి రావడం మానేసి, మనల్ని రమ్మనమనడం ఏమిటి? పిలిచాడు కదాని.. మనం అల్లుడింటికి వెళ్ళడం ఏమిటి? ఏం బావుంటుంది? అంది రుక్మిణి.
“అదేమాట నేనూఅన్నాను. ఆ! అవన్నీ పాతకాలం పద్ధతులు మామయ్యగారు. మీరు నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా ఇక్కడివచ్చేయండి. పన్లోపనిగా మా అమ్మానాన్నగార్లని, చెల్లెలు బావగారిని కూడా ఇక్కడికే పిలిపిస్తాను. మా బావమరిది, చెల్లెలు...అదే మీఅబ్బాయి,కోడల్ని కూడా పిలిచేస్తాను. గ్రాండ్ గాలాదీపావళి సెలెబ్రేట్ చేస్కుందాం అన్నాడు.” అని అల్లుడితో జరిగిన మొత్తం సంభాషణ చెప్పాడు కృష్ణమూర్తి.
“ఇది మరీన్నీ! మనమే ఎక్కువ అనుకుంటే వాళ్లందర్నీనా? వియ్యాలవారు ఏం అనుకుంటారు?” అంది రుక్మిణి.
“వాళ్లనుకోవడం సంగతి సరే! ఒకవేళ వెళ్లామే అనుకో. ఎంత వాళ్ళింట్లో మనం ఉన్నా, మనమే అల్లుడికి అమ్మాయికి బట్టలు పెట్టాలి. ఇంక అల్లుడన్నట్టు మిగతవారందరూ వస్తే కనుక, వియ్యాలవారికీ, అల్లుడి చెల్లెలు బావగారికీ, వాళ్ళ పిల్లలకీ మనమే బట్టలు పెట్టాలి. ఇంక మనబ్బాయి,కోడలు, మనవడే కనుక వాళ్ళకీ మనమే బట్టలుపెట్టాలి. పోనీ, వాడిబట్టలు వాడే కొనుక్కుంటాడనుకుందాం. అయినాగానీ అందరి బట్టలఖర్చు మనదే. ఇవన్నీఒకెత్తు. దీపావళి సామాన్లఖర్చు ఒకటి. అల్లుడి ఈ ఆహ్వానంవెనుక ఇంత పెట్టకుట్ర ఉందంటావా!?” అన్నాడు కృష్ణమూర్తి.
“మీరూ! మీ పిచ్చిమాటలూనూ!? కుట్ర ఏమిటండీ? వాళ్లేమన్నా శత్రువులా? లేక ప్రతిపక్షాలా? పెట్టేబట్టలకికూడా అలా మొహంమాడ్చుకుంటూ పెడతారా? ఇందులో ఎవరుపరాయివాళ్ళు? అసలునిజానికి మొదటిపండక్కి అల్లుడితోపాటు, వియ్యాలవారు, అల్లుడి అక్కచెల్లెలు కుటుంబాన్నికూడా పిలిచాం. వాళ్ళకి కుదరక, మొదటి పండక్కి వాళ్ళెవరూ రానేలేదు, అమ్మాయి,అల్లుడు మాత్రమేవచ్చారు. ఒకవేళ వాళ్ళందరూ వచ్చుంటే కనుక అప్పుడు ఈ బట్టలన్నీ వాళ్ళకి పెట్టుండేవారుకదా. అప్పుడు తప్పిపోయినఖర్చు ఇప్పుడు పెడుతున్నాం అనుకోండి. అంతే కానీ, ఇలా ఏడుస్తూ పెట్టకండి. మంచిది కాదు. అన్నట్టు మర్చిపోయాను. ఒకవేళ మనబ్బాయి, కోడలు వస్తే కనుక, వాళ్ళ నెత్తిన ఈ మొత్తం ఖర్చు వేసేయకండి. ఇప్పటికే వాడు ఇక్కడికి ఎప్పుడొచ్చినా ఏవో కొని తెస్తూంటాడు.” అని మొగుడికి ఓ క్లాస్ పీకింది రుక్మిణి.
==============
నిజానికి కృష్ణమూర్తి కాస్త పిసినారి మనిషి. వచ్చేచోట రూపాయి వదలడు. ఇవ్వాల్సివస్తే.. ఏదో మెలిక పెట్టి, వీలైనంతవరకు ఇవ్వకుండా తప్పించుకుంటాడు. రైతు బజార్ కి వెళ్తే.. వాళ్ళు “పావుకేజీ 12 రూపాయలు, చిల్లర లేదు 15 కి వేసేస్తా” అని ఏ వంకాయల గురించో అంటే, వద్దు పావుకేజీనే తూచు, చిల్లర 12రూ. నేనిస్తా అని కూడా చిల్లర పట్టుకు తిరిగేరకం. ఏ షాపులోనైనా చిల్లరలేక, రిటర్న్ వాళ్ళు ఏ చాక్లెట్టో ఇస్తే, ఒప్పుకునేవాడు కాదు. నాకు సుగరయ్యా. ఈ చాక్లెట్ నేనేం చేస్కోనూ? అని ఇవ్వాల్సిన చిల్లర ఇచ్చేవరకు వదిలేవాడు కాదు. ఒకవేళ తప్పనిసరై అలాతీసుకున్న చాక్లెట్స్ అన్నీ పోగేసి, అవి మెత్తబడిపోకుండా ఫ్రిజ్ లో పెట్టి, అవి ఓ ఇరవైయ్యో ముప్ఫైయ్యో అయ్యాక, తనకవి అంటగట్టిన షాపులకేవెళ్ళి ఏవో సరుకులుకొని, ఇవ్వాల్సినడబ్బుల్లో కొంత కోతపెట్టి, “ఇదిగో, ఆ బేలన్స్ డబ్బులకు ఈ ముప్ఫై చాక్లెట్స్ తీసుకో. ఇవి రూపాయి చొప్పున ముప్ఫైరూపాయలు. ఇవి చిల్లరలేదంటూ మొన్నటిదాకా నువ్వు నాకు అంటగట్టినవే. లెక్కసరిపోయిందా!” అని అలా దాచి ఉంచిన చాక్లెట్స్ వాళ్ళకే తిరిగి అంటగట్టేవాడు. ఇక బజార్లోకి ఎప్పుడెళ్లినా, వీలైనంత వరకు పక్కింటి పాపారావు గారి బండి మీద వెనక సవారీ తనదే. తను ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాల్సివస్తే.. నేను అలా ఇంకొకర్ని వెనక కూర్చొబెట్టుకు డ్రైవ్ చెయ్యలేనని చెప్పి తప్పించుకునే రకం.
అలాంటి కృష్ణమూర్తి కూతురిపెళ్లి కూడా ఓ రెండొందల కార్డులే ప్రింట్ చేయించి, చాలామందిని పిలవకుండా, ఎక్కువ భోజనాలఖర్చులేకుండా కానిచ్చేశాడు. తర్వాత విషయంతెల్సి, నీకూతురిపెళ్లి చేసేశావటగా. పిలవలేదేం!? అని ఎవరైనా అడిగితే.. చాలా తక్కువ టైమ్ లో కుదిరింది. మా వియ్యంకుడేమో “మా అమ్మగారి పరిస్థితేం బాలేదు. ఆవిడేమో మనవడిపెళ్లి చూస్తేగానీ చావనని యమభటులెన్నిసార్లొచ్చినా తరిమేస్తోంది. వెంటనే పెళ్లి చేసేయాలీ” అని హడావుడి చేస్తే.. తొందర్లోనే ఓ ముహూర్తం చూసి, హడావుడిగా చేసేసాం. ఎవర్ని పిలిచానో, ఎవర్ని మరిచానో కూడా తెలీలేదు. అయ్యో! మిమ్మల్నే మర్చిపోయానా!? సారీ!?” అని తప్పించుకునేవాడు.
ఇలాంటి కృష్ణమూర్తి దీపావళిపండక్కి అల్లుడు తమతోసహా అందర్నీ పిలవాలనుకోవడంతో , ఈ దీపావళి ఏ టపాసులు కాల్చకుండానే చేతులుకాలేలాఉందే అనుకున్నాడు. దీన్నుండి ఎలాగైనా తప్పించుకుందామని బెంగళూరులోఉన్న కొడుకు సుదీప్ తో మాట్లాడాడు. “నీ బావగారే మనందర్నీ దీపావళికి వాళ్ళ హైదరాబాద్ రమ్మని పిలిచాడురా. వాళ్ళు ఇక్కడికిరాకుండా, మేమే వెళ్తే ఏం బాగుంటుందని రామన్నాను. నీకు కూడా సెలవులు దొరకడం కష్టమేమో కదరా? పైగా ట్రైన్ లో రిజర్వేషన్ దొరకద్దూ?” అని ముందరికాళ్ళకి బంధం వేసినట్టు, నువ్వు రావు కదూ.. రావు.. రావు...రావడం లేదు... అని హిప్నటైజ్ చేసినట్టు మాట్లాడాడు.
“అబ్బ! ఎందుకు సెలవు దొరకదు నాన్నా. దీపావళికి ఎలాగూ సెలవే. పైగా మర్నాడు శని ఆదివారాలు. అంచేత మేం హైదరాబాద్ వెళ్లడానికి ఏఇబ్బందీలేదు. రిజర్వేషన్ దొరక్కపోతే.. కార్లో వచ్చేస్తాం. మీరూ వచ్చేయండి. అక్కడే అందరం సరదాగా దీపావళి చేసుకుందాం.” అని సుదీప్ చెప్పేసరికి నోట్లో సిగరెట్ అనుకుని బాంబు పెట్టుకు కాల్చుకున్నట్టైంది కృష్ణమూర్తి కి.
ఇక హైదరాబాద్ వెళ్ళక తప్పేట్టులేదు. తను విజయవాడలో ఉంటున్నాడు కనుక, రిజర్వేషన్ దొరకదు అని చెప్పి తప్పించుకునే వీలు లేదు. అయిదు గంటల ప్రయాణంలో బోల్దన్ని బస్సులు, రైళ్లున్నాయి. సర్లే! ఏం చేస్తాం! ఈ ఖర్చు ఇంకెక్కడో తగ్గించుకోవచ్చు అని సమాధానపడి హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధపడ్డాడు
===============
వియ్యాలవారు, అల్లుడు, అమ్మాయి విజయవాడ వస్తే తను చెయ్యాల్సిన మర్యాదలన్నీ, హైదరాబాద్ లో అల్లుడింట్లో తాము పొందారు కృష్ణమూర్తి, రుక్మిణీ. మామగారికి, అత్తగారికి తానే బట్టలు పెట్టాడు అల్లుడు. అయ్యో! ఇది మర్యాదకాదు అల్లుడు గారు, మేం మీకు పెట్టాల్సిందిపోయి, మీరే మాకు బట్టలుపెట్టడం ఏమిటి?” అని మొహమాటపడింది రుక్మిణి. కృష్ణమూర్తి మాత్రం కలిసొచ్చేకాలానికి ఖర్చు త(ప్పిం)గ్గించే అల్లుడు దొరికాడు అని మురిసిపోయాడు. కృష్ణమూర్తి కొడుకు సుదీప్, భార్య సునందతో బెంగళూరు నుండి వస్తూ.. బావగారికి, చెల్లికీ మంచి బట్టలు తీసుకొచ్చాడు. ఈ కాలం పిల్లలు ఆడైనా, మగైనా ఎప్పుడు షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకునే బజార్లమ్మట కూడా తిరుగుతారు కనుక, బావగారికి, చెల్లెలికీ అవే కొనుక్కొచ్చాడు. బావగారు, చెల్లి “ఓహ్! సూపర్ సెలెక్షన్!” అని సంతోషించినా, పెద్దవాళ్ళుమాత్రం..అదే కృష్ణమూర్తి వియ్యంకుడు,వియ్యపురాలు “హవ్వ! ఇదేం పెట్టుపోతలూ!?లక్షణంగా చీరా, జాకెట్టు ముక్క ఓ బొట్టెట్టి ఇవ్వకుండా!?” అని రహస్యంగా నోళ్ళు నొక్కుకున్నారు. ఇలాంటి పెద్దమనిషి బుద్ధుల్లేని, కృష్ణమూర్తి మాత్రం ఏం బట్టలు అల్లుడికి కూతురికీ పెట్టారు అన్నది కాకుండా, తనకెంత ఖర్చు తప్పిందీ అన్నది లెక్కవేసి, దాదాపు ఓ అయిదువేలు లాభం అని లోలోన సంతోషపడ్డాడు. భార్య రుక్మిణి దగ్గరమాత్రం బయటికే సంతోషం వ్యక్తంచేశాడు. ఎవరూ చూడకుండా మొగుడిడొక్కలో ఓ పోటు పొడిచింది రుక్మిణి.
దీపావళిరోజు ఉదయం కృష్ణమూర్తి కుటుంబసభ్యులంతా దీపావళి మతాబుల సామాన్ల కొనుగోలుకు బయల్దేరబోతుంటే. కృష్ణమూర్తి “మీరాగండి.ఏ షాప్ లో కొనాలో నేను సర్వచేసి వస్తాను, అప్పుడు అందరం అక్కడికే వెళ్దాం” అని ముందుగా ఒక్కడే బయల్దేరాడు, “ఎందుకు మామగారూ.. అందరం వెళ్ళి నచ్చినవి కొనుక్కువద్దాం” అని సుదీప్ వారించినా వినలేదు. దీపావళిసామగ్రి అమ్మేషాపుల్లో ఓ ముప్ఫైషాపులు కలయతిరిగి, ధరవరలు అడిగి. వాటిలో ఓ ఇరవై మంది దాదాపు ఒకే రేటు చెప్తూండంతో.. వాటిలో ఓ మూడింటిలో ఫైనల్ రిబేట్ ఎంత అన్నది పదిసార్లు బేరమాడి ఖరారు చేసుకుని, ఇప్పుడే వస్తా... అని ఇంటికొచ్చి అందర్నీ బయల్దేరదీశాడు. మేమెందుకూ? మీ మగాళ్ళంతా వెళ్లిరండి సరదాగా అని ఆడవాళ్ళు తప్పించుకున్నారు. సరే అని కృష్ణమూర్తి, ఆయన వియ్యంకుడు, సుదీప్, కిరణ్ బయలుదేరాడు.
దార్లో “అసలు ఈ వూర్లో మీకు ఈ షాపుల గురించి ఏం తెల్సు మామగారూ? ఇక్కడా మీ బేరాలు సాగించారా ఏం!?” అనడిగాడు అల్లుడు కిరణ్
“ఇందులో తెలిసేది ఏం లేదు అల్లుడూ. నీకు తెలుసో లేదో?ఈ దీపావళి సామానుల అమ్మకాల్లో వీళ్ళు లక్ష మదుపు పెట్టి... అయిదు లక్షలు దాకా సంపాదిస్తారు. ఓ అగ్గిపెట్టెల పేక్ మీద డజన్ 350 రూ అని ఉంటుంది.. కానీ అరవై శాతం డిస్కౌంట్ అని 140 కే అమ్ముతారు. కానీ మనం వదలకుండా బేరమాడితే అది 75 కే వస్తుంది. అసలు వాళ్ళు దాన్ని కొనేదే 35 రూ లకి.. దానికి పది రెట్లు పెంచి 350 కి అమ్ముతారు. మనం గీసి గీసి బేరాలాడితే.. లాభం లో నష్టం అని 75 కే ఇచ్చేస్తారు. ఐతే మరీ నాలాగ గీసిగీసి బేరాలాడేవాళ్లు ఎక్కువమంది ఉండరు కనుక 350 చెప్పి.. ఏ 250 కో అమ్మేస్తారు. అలా అయినా వాళ్ళకి భారీగాలాభాలే కదా. అసలు అక్కడున్న బోర్డులు చూశావా? 60%, 70% డిస్కౌంట్ అని ఎలా పెట్టేరో!? దాన్ని బట్టే నీకు అర్ధమై ఉంటుంది.. ఈ దీపావళీ సామగ్రి అమ్మకం ఎంత లాభసాటి అనేది.” అన్నాడు కృష్ణమూర్తి.
“మీకోదండం మామగారూ! ఇన్ని తెలిసిన మీరే ఓ షాపుపెట్టి ఉండాల్సింది. బోల్డు లాభాలార్జించుండేవారు.” అన్నాడు కిరణ్ నవ్వుతూ.
“అయ్యో! అవును సుమీ! అల్లుడూ. నాకీ ఆలోచనే రాలేదు. ఎంతపనైంది!” అని వాపోయాడు కృష్ణమూర్తి. ఇదంతా వింటున్న మిగతావారు ఘొల్లున నవ్వేశారు.
=================
మొత్తానికి కృష్ణమూర్తి చూపించిన షాపుల్లోనే దీపావళి సామగ్రి కొన్నారు. “మీరేం డబ్బులు తీయకండి మామగారూ. దీపావళి సామానుల ఖర్చునాదే” అని కిరణ్ మామగార్నీ, నేను పే చేస్తా అని ఫోన్ పే తో సిద్ధపడ్డ బావమరిదిని అడ్డుకున్నాడు. కృష్ణమూర్తి మహదానందపడిపోగా, సుదీప్ నొచ్చుకున్నాడు. మన సొమ్ముకాదు కదా అని, కృష్ణమూర్తి తాటాకు పటాసులు, లక్ష్మీ బాంబులు కొనిపించబోయాడు.
“అబ్బే! అవన్నీ వద్దు మామగారూ. ఇప్పుడంతా సౌండ్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్ ఉండరాదని, పైగా అవి ఎప్పుడు పడితే అప్పుడు కాల్చరాదని, రాత్రి 8 నుండి 10 గం లోపలే కాల్చాలని కోర్ట్ ఆర్డర్లున్నాయి. మనం కాదు కూడదని కొని,కాల్చితే సెక్యూరిటీ అధికారి కేసవుతుంది. ఎందుకొచ్చినగొడవ!?”అని సుదీప్ సున్నితంగా అడ్డుకున్నాడు. అయితే ఈ మతాబులు, చిచ్చు బుడ్లే మరికొన్ని కొను. బాగుంటాయి అని అవి కొంచెం ఎక్కువ కొనిపించాడు కృష్ణమూర్తి.
మొత్తానికి ఏవో మతాబాసామన్లు కొన్నామనిపించుకుని, ఇంటికొచ్చారు. పిల్లలు దీపావళి పిస్తోళ్ళతో ఢమఢమలు మొదలెట్టేశారు. చీకటిపడ్డాక, సంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళు ఇంట్లో లక్ష్మీపూజ, దీపారాధన చేసి, ఇంటి ముంగిట్లో దీపాలు పెట్టారు. ఆతర్వాత అంతా తెచ్చిన మతాబా సామాన్లు కాల్చడం మొదలెట్టారు.
“మీరూ రండి, ఈ మతాబులు కాల్చండి బావగారు అని వియ్యంకుణ్ణి పిలవబోతే.. ఆయన సున్నితంగా వద్దని, “చిన్నతనంలో తెగకాల్చి ఆనందించాంగా బావగారు. ఇప్పుడుకూడా ఏంటి!? పిల్లలు కాలుస్తూంటేచూసి ఆనందించాలిగానీ!”అని పరోక్షంగా కృష్ణమూర్తినికూడా వారించాడు. “నీకు ఈవయసులో అవసరమా ఈ మతాబులు కాల్చడాలు అవీ!” అన్నట్టు చూస్తూ.
కృష్ణమూర్తికి ఆ చూపుఅర్ధమైనా, దులిపేసుకుని, “నాకుమాత్రం ఈ దీపావళి టపాకాయలు, మతాబులు అంటే మహాప్రీతి బావగారు. ఈరోజు చిన్నపిల్లాడ్నైపోతానంటే నమ్మండి. అసలు వీళ్ళు బాంబులు కొనద్దన్నారు గానీ, నాకైతే అవే ఎక్కువిష్టం. తాటాకు టపాకాయలు ఇలా చేత్తో అంటించి అలా విసిరేస్తుంటే భలే మజాగా ఉంటుంది. పోన్లెండి! ఏంచేస్తాం! ఈసారికిలా ఈ మతాబులు, చిచ్చుబుడ్లుతో కానిచ్చేస్తాను అని వియ్యంకుణ్ణి పట్టించుకోకుండా.. కొన్ని కాకర్లు, భూచక్రాలు వెలిగించి ఆనందించాడు. పిల్లలూ.. మీరు ఈ విష్ణుచక్రాలు కాల్చలేరు. ఇటివ్వండి నేను కాల్చి చూపిస్తాను అని వాటిని తీసుకు కాల్చాడు. అసలు కృష్ణమూర్తి ప్రతీ దీపావళిపండక్కి తాను కొనేసామాన్లు తక్కువ, పక్కింటివాళ్ళతో చేరి, వాళ్ళ కాకర్లు, భూచక్రాలు, విష్ణుచక్రాలు వంటివి సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. కాల్చేవి ఎక్కువ.
పిల్లల చేతిలోంచి తీసుకున్న విష్ణుచక్రం కాలుస్తూంటే “జాగ్రత్తండీ. షర్ట్ పై ఆ రవ్వలు పడతాయి” అని రుక్మిణి హెచ్చరించింది. “ఏం పర్లేదులే! నాకు తెలీని విద్యలా ఇవి!” అని ఓ రెండు విష్ణు చక్రాలు కాల్చాడు. పిల్లలు కేరింతలు కొడుతుంటే.. రెచ్చి పోయి చిచ్చుబుడ్డి ఒకటి చేత్తోనే వెలిగించి దాన్ని ఇంటి కాంపౌండ్ గేటుపైన పెట్టాడు. “ఏంటినాన్నగారు! మీరు మరీనీ!” అని కిరణ్ కోప్పడ్డాడు. కొడుకు కోపాన్ని లెక్కచేయ్యకుండా, విజయగర్వంతో వియ్యంకుణ్ణి చూస్తూ ఇంకో చిచ్చుబుడ్డీ అలానే చేత్తో వెలిగించి గేటుపైన పెట్టాడు. అలా పెడుతూండగానే ఆ చిచ్చుబుడ్డీకాస్తా ఢాం అని పెద్దశబ్ధం చేస్తూ అతని చేతిలోనే పేలిపోయింది. అరచెయ్యి వెంటనే బొబ్బలెక్కిపోయింది. దాని రవ్వలు కృష్ణమూర్తి షర్ట్ పైపడి చిన్నచిన్నగా కాలి కన్నాలు పడ్డాయి. ఒక్క క్షణం చెవులు దిబ్బడవేసి, ఏం వినబడలేదు. కళ్ళు బైర్లుకమ్మి కాసేపు మసకబారాయి. అందరూ వెంటవెంటనే.. “ఏమండీ!..నాన్నగారూ.. మామయ్య గారూ... బావగారూ... అన్నయ్యగారూ.. అంకుల్... అంకుల్... తాతగారూ...! అంటూ టీవీసీరియల్లో పాత్రల్లా తమ తమ ఆందోళనాపూర్వక హావభావాలు వ్యక్తపరిచారు.
రెండు నిమిషాల తర్వాత, తేరుకున్న కృష్ణమూర్తి, పెద్ద ప్రమాదం ఏం లేదని తెల్సుకుని, “దొంగ వెధవలు! ఈ చిచ్చుబుడ్లమందులో రాళ్ళు కూడా ఏరకుండా దట్టించేశారు. దాంతో అవి ఇలా పేలి చచ్చాయి!” వాళ్ళని తిట్టి, “ఏం పర్లేదు. ఐ యాం ఆల్ రైట్!” అన్నాడు బొబ్బలెక్కిన అరచేతిని చూసుకుంటూ, మనసులో “వామ్మో! వాయ్యో! అమ్మోయ్! నానయోయ్!” అని ఏడుస్తూ. గబగబా ఇంత వెన్న పట్టుకొచ్చిన వియ్యపురాలు, రుక్మిణికి ఇచ్చింది అరచేతికి రాయమని. ఆ వెన్నపూతకి ఇంకాస్త ఉపశమనంపొందిన కృష్ణమూర్తి అందర్నీ చూసి ఓ ఏడవలేనినవ్వు నవ్వాడు.
“మీరు కాల్చాలనుకున్నబాంబు ఇలా చిచ్చుబుడ్డిరూపంలో మీచేతిలో కాలింది..అదే పేలింది. మీకోరికానెరవేరింది. ఇప్పుడు చేతవెన్నముద్దపట్టిన కృష్ణమూర్తిలా ఉన్నారు నాన్నగారు” అన్నాడు నవ్వుతూ కిరణ్, వాతావరణాన్ని తేలిక చేస్తూ. మొత్తానికి ఏ టపాసులూ కాల్చకుండానే చేతులు కాల్చుకున్న కృష్ణమూర్తి దీపావళి పండగ అల్లుడింట అలా జరిగింది.
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|